హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం 2018లో యావత్ భారతావనిని కుదిపేసింది. వర్క్ ప్లేస్‌లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవలను పలువురు మహిళా సెలబ్రిటీలు కెమరాల ముందుకొచ్చి బహిర్గతం చేశారు. సినీ పరిశ్రమ, వాణిజ్యం, రాజకీయాలు ఇలా పలురంగాల్లో పెద్దలుగా చెలామణి అవుతున్న వారి చీకటి భాగోతాలను బయటపెట్టారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో చాపకింద నీరులా సాగిపోతున్న కాస్టింగ్ కౌచ్ పెను దుమారం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ను కుదిపేసిన మీటూ ఉద్యమంపై బాలీవుడ్ నటి కాజోల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మీటూ ఉద్యమం తర్వాత సినిమా సెట్స్‌లో మహిళల పట్ల పురుషుల ప్రవర్తించే తీరులో చాలా మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. పురుషులు తమ ప్రవర్తన విషయంలో అతిజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.
వాస్తవానికి సినిమా సెట్స్‌లో మాత్రమే కాకుండా…అన్ని చోట్ల మహిళల పట్ల పురుషుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని కాజల్ అభిప్రాయపడింది. మంచివారు, చెడ్డవారు అని తేడా లేకుండా పురుషులందరూ మహిళల పట్ల జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ మార్పు చాలా అవసరమైనదిగా కాజోల్ చెప్పింది. ముంబైలో జరిగిన ‘దేవి’ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.