‘చంద్రబాబు, జగన్, పవన్‌కల్యాణ్‌లకు ఓటెయొద్దు.. వారంతా సీట్లు అమ్మకుని రాష్ట్రాన్ని దోచుకుంటారు’ అని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, జగన్, పవన్‌పై విరుచుకుపడ్డారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని.. దమ్ముంటే పవన్‌కల్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు. మెగాస్టార్ చిరంజీవితో పోల్చితే పవన్‌కల్యాణ్‌కు డ్యాన్స్ చేయడం రాదని విమర్శించిన పాల్.. తాను డ్యాన్స్ చేసి చూపించారు.
‘మా పార్టీకి హెలికాప్టర్ గుర్తు రాకుండా అడ్డుకునేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. మాటలు కూడా రాని తన కొడుక్కి చంద్రబాబు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు’ అని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి ఓ మల్టీ స్పెషల్ ఆస్పత్రి కట్టిస్తానని హామీ ఇచ్చారు పాల్.