ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫామ్‌లను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో తమ పార్టీ ప్రతినిధులపై దాడి చేసి బీఫామ్‌లను ఎత్తుకెళ్లారని.. అందులో పేర్లను పొలిన అభ్యర్థులతో నామినేషన్లు వేయించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ తోడుదొంగలని.. వారు గెలిచే అవకాశం లేదని పాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ని గెలిపించినట్లే ఆంధ్రాలో ‘ప్రజాశాంతి’ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నర్సాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానని హామీ ఇచ్చారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ జరిపేంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వాయిదా వేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదా కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని పాల్ చెప్పారు. తాను చంద్రబాబు మనిషిని కాదని ఆయన స్పష్టం చేశారు. తాను బాబు మనిషినైతే ఆయనకు ఓడించాలని ఎందుకు కోరుతానని ప్రశ్నించారు.