యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెరపై మరోసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ .(EMK) రియాలిటీ షో తో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించి కొత్త ప్రొమో విడుదలైంది. ఈ నెలలోనే ఎవరు మీలో కోటీశ్వరులు ప్రసారం కాబోతోందంటూ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇందులో ఒక స్కూలు టీచర్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను అడిగింది. కలెక్టర్ అని ఒకరు, పైలెట్ అని మరొకరు సమాధానం చెప్తుండగా ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుదాం అనుకుంటున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పెద్దయ్యాక అదే అమ్మాయికి ఎన్టీఆర్ ముందు హాట్ సీట్‌లో కూర్చునే అవకాశం వరించింది. అప్పుడు ఎన్టీఆర్.. జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఆమె మరోసారి ‘అమ్మనవుదాం అనుకుంటున్నాను’ అని బదులిచ్చింది. అందుకు అని ఎన్టీఆర్ ప్రశ్నించగా.. రేపటితరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యం అంటూ తన తల్లి పడ్డ కష్టాలను వివరించింది.
ఆమె సమాధానం ఎన్టీఆర్ మనసును కూడా గెల్చుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెల్చుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ మీసం మెలేసి సవాలు చేశాడు తారక్. ఈ లేటెస్ట్ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.