బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ ఫోన్ లాక్కున్నారని ముంబైకు చెందిన ఓ జర్నలిస్ట్ పోలీసులను ఆశ్రయించారు. సల్మాన్ సైకిలింగ్ చేస్తున్న సమయంలో వీడియో తీస్తున్నందుకు తమ ఫోన్ లాక్కున్నారని డీఎన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘బుధవారం సాయంత్రం మేము జుహు నుంచి కండివిలి వెళ్తుండగా డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సల్మాన్‌ను చూశాం. అతను తన ఇద్దరు బాడీగార్డులతో కలసి సైకిలింగ్ చేస్తున్నారు. దీంతో మేము సల్మాన్ వీడియో తీసుకునేందుకు బాడీగార్డుల అనుమతి కోరాం. దీనికి వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అంగీకరించారు. దీంతో సల్మాన్ సైకిలింగ్ చేస్తుండగా వీడియో తీయడం మొదలుపెట్టాం. ఇంతలో సల్మాన్ తన బాడీగార్డులకు సైగ చేయడంతో.. వారు మా వాహనం దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్న నా సహోద్యోగిని వెనక్కి నెట్టివేశారు. వెంటనే సల్మాన్ కూడా అక్కడికి వచ్చి తమ సెల్‌ఫోన్లను లాక్కుని వెళ్లారు. నేను జర్నలిస్టు అని చెప్పిన సల్మాన్ వినిపించుకోలేద’ని సదురు జర్నలిస్టు తన రెండు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, జర్నలిస్టు ఫిర్యాదుకు వ్యతిరేకంగా సల్మాన్ బాడిగార్డు కూడా పోలీసులకు క్రాస్ అప్లికేషన్ సమర్పించారు. ఆ జర్నలిస్టు, సల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతూ.. ఆయన అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించారని తెలిపారు.