నటుడు ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా ‘జోడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. మరి జోడితో అయినా ఆది సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..?
కథ : కమలాకర్ రావు (నరేష్) బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ వ్యక్తి. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు క్లబ్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతూ ఉంటాడు. క్రికెట్ మీద పిచ్చితో కొడుక్కి కపిల్ అని పేరు పెంటుకుంటాడు. తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటంతో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు కపిల్ (ఆది సాయి కుమార్). సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే కపిల్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇన్సిస్టిట్యూట్‌లో పనిచేసే కాంచనమాల(శ్రద్ధా శ్రీనాథ్)తో ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్‌ను ఇష్టపడుతుంది. కానీ కాంచన, బాబాయి రాజు (శిజ్జు) మాత్రం వారి పెళ్లికి అంగీకరించడు. తన అన్న కూతురిని ప్రాణంగా చూసుకునే రాజు.. కాంచన, కపిల్‌ల పెళ్లికి ఎందుకు నో చెప్పాడు..? ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏంటి..? ఈ కథలోకి ఇండస్ట్రియలిస్ట్ అవినాష్ ఎలా వచ్చాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు: కెరీర్ స్టార్టింగ్‌లోనే లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ కపిల్ పాత్రలో ఈజీగా నటించేశాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. తన కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. కాంచనమాల పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఒదిగిపోయారు. జెర్సీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ శ్రద్ధా ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ మరోసారి అద్భుతం అనిపించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. వెన్నెల కిశోర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన కడుపుబ్బా నవ్వించాడు. ఇతర పాత్రల్లో సత్య, శిజ్జు, గొల్లపూడి మారుతీరావు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ : సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది, ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడు. దర్శకుడు విశ్వనాథ్ అరిగెల ప్రేమకథతో పాటు మంచి సందేశం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా కథను రెడీ చూసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా లవ్ స్టోరిలో కొత్తదనం లేకపోవటంతో ప్రథమార్థం బోరింగ్‌గా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో కథ ఆసక్తికర మలుపు తిరిగినా.. కథనం నెమ్మదిగా సాగటం నిరాశపరుస్తుంది.
హైలైట్స్ : కథ
డ్రాబ్యాక్స్ : నెమ్మదిగా సాగే కథనం
టైటిల్ : జోడి
నటీనటులు: ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య
దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల
నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం
చివరిగా : ‘జోడి’ కుదరలేదు
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)