టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అత్యవసర సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఈ సమావేశం జరగడంతో ‘మా’లో మరోసారి వివాదాలు తలెత్తాయని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం అని సభ్యులు పేర్కొన్నప్పటికీ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కార్యవర్గ సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. అయితే నిన్నటి సమావేశంపై ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ స్పందించారు. అసలు సమావేశం నిర్వహించడానికి గల కారణాలు, చర్చించిన అంశాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
‘ఆదివారం జరిగిన సమావేశం ఆత్మీయ సమ్మేళనం, అంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించాము. ముఖ్యంగా కొంతమంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే వాటిని పరిష్కరించలేకపోయాము. దానికి అనేక కారణాలున్నాయి. ఈ క్రమంలో సభ్యుల మధ్య వాదోపవాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే సమావేశం వాడివేడిగా జరిగిన ఉపయోగకరమైన మీటింగ్‌గా భావిస్తున్నాం.
ఈ సమావేశంలోనే మెజారీటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టాలని కోరారు. అయితే 20 శాతం మంది ‘మా’ సభ్యులు ఆమోదం తెలపితేనే ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇది జరిగితేనే ‘మా’సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. 20 శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపిన 21 రోజుల్లోపు తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మీటింగ్ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. మీటింగ్ జరగాలని కోరుకునేవారు ‘మా’ కార్యాలయానికి వచ్చి సంతకాలతో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఫీసులకు వచ్చే వీలు లేనివారు లేఖలు, ఈమెయిల్స్‌తో మద్దతు తెలిపినా పరిగణలోకి తీసుకుంటాం’ అంటూ జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు.