సినీ నటులు జీవిత, రాజశేఖర్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ ఉదయం వారు జగన్‌తో సమావేశమయ్యారు. వీరితో పాటు సినీ నటి హేమ, యాంకర్, నటి శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి కూడా వైసీపీలో చేరారు.
జగన్‌తో సమావేశం అనంతరం జీవిత, రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. జగన్‌తో తొలుత మనస్పర్థలు వచ్చిన మాట నిజమేనని, వాటిని ఇంకా పొడిగించుకోకూడదనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరినట్లు రాజశేఖర్ వెల్లడించారు. ఎవరితోనూ శత్రుత్వం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, లక్ష్మీపార్వతితో వచ్చిన పొరపొచ్చాలను కూడా పరిష్కరించుకున్నామన్నారు. జగన్‌లో గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా మార్పు కనిపిస్తోందని చెప్పారు. హైటెక్ సిటీకి పునాది వేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా మంచి పేరే తెచ్చుకున్నారని, తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయరంగానికి మేలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు జగన్ అని, ఆయన ఓ పులిబిడ్డ అని అభివర్ణించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరిలో రాబోయే ముఖ్యమంత్రిగా జగన్ అయితే బావుంటుందని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చే డబ్బలుకు, చీరలకు ఆశ పడొద్దని జీవిత అన్నారు. మన భవిష్యత్ బాగుండాలంటే జగన్‌ను బలపరచాలని పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యేందుకు కృషి చేస్తామని వారు వెల్లడించారు.