ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. జగన్ పాలనపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచిచూడాలన్నారు. జగన్ 100 రోజుల పాలనకు 100 మార్కులు వేయాల్సిందే అన్నారు. సీఎం జగన్‌ను చేయిపట్టి నడిపించేవాడు కావాలని జేసీ తెలిపారు. సలహాలు ఇవ్వాలని కోరితే ఆలోచిస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని జేసీ అన్నారు.
ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమేనని జేసీ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనంలో చేయడం కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదని అన్నారు. అందులో ఉన్నవారినే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని తెలిపారు. సీఎం జగన్ ఏదో మంచి ఆలోచించి ఇలా చేశారని.. అవి మంచి ఫలితాలు ఇస్తాయా.. లేదా అనేది కొంతకాలం వేచి చూడాలన్నారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని దాన్ని నేలకేసి కొట్టొద్దని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ.. అలాంటప్పుడు అంతటితో ఆగని ఆయన.. మా వాడు చాలా తెలివైనవాడు.. అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.