నటీనటులు: గంటా రవి, మాళవిక, వినోద్ కుమార్, పరుచూరి వెంకటేశ్వరావు, పోసాని తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాత: కె.అశోక్‌కుమార్
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘జయదేవ్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
జయదేవ్(గంటా రవి) సింహాద్రిపురం అనే ఊరిలో ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. అయితే అదే ప్రాంతానికి చెందిన మస్తాన్ రాజు(వినోద్ కుమార్) అనే వ్యక్తి అక్రమంగా మైనింగ్ చేస్తూ.. అతడికి అడ్డుపడే ప్రతి ఒక్కరినీ చంపేస్తుంటాడు. అలానే ఓ పోలీస్ ఆఫీసర్ తన అక్రమాలను బయటపెడుతున్నాడని తెలుసుకొని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. ఆ కేసు జయదేవ్ చేతుల్లోకి వెళ్తుంది. మరి జయదేవ్.. మస్తాన్ ఆగడాలను అరికట్టాడా..? చివరకు ఏం జరిగింది అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన తోటి పోలీస్ ఆఫీసర్ కు అన్యాయం జరిగితే ఎలా రియాక్ట్ అవుతాడు..? అతడికి ఎలా న్యాయం చేశాడనే పాయింట్ తో ఈ సినిమా నడుస్తుంది. దానికి కాస్త గ్లామర్, కామెడీను యాడ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమాలో మొదటి భాగం కంటే రెండో భాగం కాస్త ఆసక్తిగా ఉంటుంది. ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. గంటా రవికి ఇది మొదటి సినిమా. నటన, హావభావాల విషయంలో అతడు మరింత పరిణితి చెందాల్సిఉంది. అతడి బాడీ ల్యాంగ్వేజ్ పోలీస్ గా ఏ మాత్రం సెట్ కాలేదు. మాళవిక గ్లామర్ షోకి పరిమితమైంది. తన పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉండదు. ప్రతినాయకుడి పాత్రలో కొత్త వినోద్ కుమార్ ను చూడొచ్చు. తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్, హరితేజ జంటగా కనిపించి కాసేపు నవ్వించారు. పోసాని కృష్ణమురలి, బిత్తిరి సత్తి లు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. టెక్నికల్ గా కూడా సినిమా అంతంత మాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఏ మాత్రం బాలేదు. మణిశర్మ పాటలు గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పిస్తుంది. సినిమాలో అనవసరపు సన్నివేశాలు
చాలానే ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సివుంది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తానికి ఈ సినిమాకు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిది.
రేటింగ్: 1.5/5