Jani Master Pressmeet: టాలీవుడ్ లో జానీ మాస్టర్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళ్ ఇండస్ట్రీలలో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలకి ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కి కూడా జానీ మాస్టర్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా సతీష్ అనే ఒక డాన్సర్ జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు.
జానీ మాస్టర్ మీద షాకింగ్ ఆరోపణలు చేస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశాడు. జానీ మాస్టర్ కావాలనే తనకి ఎటువంటి వర్క్ ఇప్పించడం లేదని, ఎవరైనా ఇప్పించినా సహించను అని బెదిరిస్తున్నాడని సతీష్ చెప్పాడు. జానీ మాస్టర్ వల్లే తను నాలుగు నెలలుగా పని లేకుండా కూర్చున్నానని, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని కంప్లైంట్ ఇచ్చాడు.
తాజాగా ఆ వీడియో గురించి జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. ఒక ప్రెస్ మీట్ పెట్టిన జానీ మాస్టర్ సతీష్ తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిజమని నిరూపించినా కూడా తను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానని చెప్పారు..
“నేను TFTDDA అధ్యక్షుడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాదు. మా యూనియన్ కోసమే నేను ఐదు కోట్లు పెట్టి ల్యాండ్ తీసుకున్నాను. కానీ అలాంటి సమస్యల్లో ఉంది. నేనైతే పెద్దలతో మాట్లాడగలనని, మా సభ్యులకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించగలను అన్న నమ్మకంతోనే నన్ను ఎంచుకున్నారు. నేను అధ్యక్షుడిగా నా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరిగాయి. మధ్యలో రంజాన్ కూడా వచ్చింది. రంజాన్ సమయంలో నేను కొరియోగ్రఫీ కూడా చేయను. కనీసం పాటలు కూడా వినను. దీక్షలోనే ఉంటాను. అయినా ఈ ఆరు నెలల్లో యూనియన్ అభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టాము. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా రామ్ చరణ్ గారు ఉపాసన గారితో మాట్లాడాను” అని చెప్పుకొచ్చారు జానీ మాస్టర్.
Jani Master About Satish:
సతీష్ వివాదం గురించి క్లారిటీ ఇస్తూ, “యూనియన్ రూల్స్ ప్రకారం యూనియన్లో జరిగినది బయటకు చెప్పకూడదు. కానీ సతీష్ అనే వ్యక్తి నా గురించి ఒక వీడియో పెట్టాడు. అలా చేయకూడదు తీసేయమని మాత్రమే అతన్ని అడిగాము. అతను కానీ తప్పైందని లెటర్ రాసినా కూడా మేము క్షమించి వదిలేసే వాళ్ళం. కనీసం ఫైన్ కూడా వేసేవాళ్ళం కాదు. కానీ అతను మమ్మల్ని దుర్భాషలాడాడు. తానేంటో చూపిస్తానని తాను ఒక నక్సలైట్ అని తుపాకీ కూడా ఉందని బెదిరింపులు చేశాడు. అందుకే అతనికి ఫైన్ విధించాము. ఆయేషా చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ ప్రకారమే అతనికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. నేను మొదటినుంచి డాన్సర్స్ కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసే వ్యక్తిని. కొరియోగ్రాఫర్ కమిషన్ కూడా తీసుకోకుండా అసోసియేషన్ కి డబ్బులు ఇచ్చేస్తాను. పుష్ప 2, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు చేసేటప్పుడు కూడా డాన్సర్స్ కే ఎక్కువ అవకాశాలు ఇచ్చాము. సతీష్ కి పని రాకుండా మేము ఎప్పుడూ చేయలేదు. అతని పేమెంట్ కూడా అతను అసోసియేషన్ నుంచి కాకుండా పర్సనల్ అకౌంట్ లోనే వేయించుకున్నాడు. మా అసోసియేషన్ లో ఎవరికి సమస్య వచ్చినా నేను డబ్బులు ఇచ్చాను. ఎప్పుడూ ఒకరి నుంచి దోచుకోవాలని అనుకోలేదు. సతీష్ చేసిన వీడియోలో ఒక్కటి నిజమని నిరూపించినా కూడా నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను.. నేను ఒక చోట కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నాను. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి నా వల్ల ఇబ్బంది రాకూడదు అని నేను ఈ వివరణ ఇస్తున్నాను. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాలను బయట పెడుతున్నాను” అని అన్నారు జానీ మాస్టర్.