శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ మొదటి చిత్రం ‘ధడక్’ లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు. ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్ (వర్కింగ్ టైటిల్), రుహీ అఫ్జా, తక్త్’ సినిమాలతో బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారామె. అయితే సౌత్‌లో జాన్వీ నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ తండ్రి బోనీకపూర్ నిర్మాతగా హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఓ కీలక పాత్రలో జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా అంటోంది. మరి.. తండ్రి నిర్మించబోయే సినిమాలో నటిస్తారా? వేచి చూద్దాం. ఈ సంగతి ఇలా ఉంచితే… ‘మానాడు, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో జాన్వీ సౌత్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదన్న విషయం తెలిసిందే.