సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాలకు ప్రణాళికలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే “జెండర జెండర జెండా జనసేన జెండా” అనే పాటను శనివారం విడుదల చేశారు. ఇది జనసేన జెండా, పవన్ అన్న జెండా అంటూ.. సాగే ఈ పాటను శ్రీనివాస్ దుంపటి రాయగా.. రామ్ నారాయణ్ సంగీతం అందించారు. స్వరాగ్ కీర్తన్ ఈ పాటను ఆలపించారు. భరత మాత ముద్దు బిడ్డ పవన్ అన్న జెండా. ఇది తెలుగోడి జెండా, నీతి కొరకు జాతి కొరకు పుట్టినదీ జెండా అంటూ సాగే ఈ పాట ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. పవన్ ప్రజల మధ్యనున్న ఫొటోలతో ఈ వీడియో లిరికల్‌ను రూపొందించారు.
జనసేన సిద్ధాంతాలను తేలిగ్గా జనంలోకి తీసుకెళ్లేలా ఈ పాటను రూపొందించారు. తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండా దండా అంటూ.. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉంటుందని పాట ద్వారా చెప్పుకొచ్చారు. కులమేదైనా మతమేదైనా అసమానతలు లేని జెండా జనసేన జెండా అనడం ద్వారా తమ పార్టీ ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని తెలిపారు.