ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేసి స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు.
”కరోనాపై పోరాటానికి జనతా కర్ఫ్యూ పాటించాలి. కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మనం తీసుకునే చర్యలు భవిష్యత్‌కు ఉపయోగపడాలి” అని మోడీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. జనతా కర్ఫ్యూకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైద్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆంధప్రదేశ్‌లో పెట్రోల్ బంకులు కూడా మూసివేశారు. తెలంగాణ సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 14 గంటలు కర్ఫ్యూ కొనసాగనుండగా, తెలంగాణలో ఇవాళ ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కొనసాగనుంది.