ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే సర్వేలతో జనసేనకు పనిలేదని.. రాష్ట్రంలో జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందని ఆ పార్టీ నేత మాదాసు గంగాధరం అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రోజులుగా ఈవీఎంలపై వివిధ పార్టీల నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఈసీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జరుగుతున్న మాటల యుద్ధంపై స్పందించిన మాదాసు.. విజయసాయిరెడ్డికి ఏ పనీలేదేమో గానీ.. జనసేనకు మాత్రం ప్రజల సమస్యలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జనసేన ప్రజల్లో ఉంటుందన్న విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. త్వరలోనే ఉత్తరాంధ్రలో పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి పరిష్కారం దిశగా ఆలోచన చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, ఇక రాజకీయాలతో పనిలేకుండా అన్ని పార్టీలూ కలిసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కాలమానిని విడుదల చేయనున్నారని తెలిపారు. ఆ కాలమానిని ప్రకారం తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని వివరించారు.