జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. పూజ అనంతరం వారాహి పైకి ఎక్కి తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వారాహికి కొండగట్టు అంజన్న సన్నిధిలోనే ఎందుకు ప్రత్యేక పూజలు చేయించాల్సి వచ్చిందో కారణాన్ని వివరించాడు.
కొండగట్టు అంజన్న స్వామి అంటే తనకు ఎంతో నమ్మకమని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో ఒకసారి తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టు వచ్చి ఆంజనేయస్వామిని దర్శించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఓ హైటెన్షన్ తీగ తెగి తనపై పడిందని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన వెంట ఉన్నవారందరికీ షాక్ కొట్టిందని.. కానీ తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. ఆ ప్రమాదంలో దేవుడి దయ వల్ల కేవలం జుట్టు మాత్రం కాలిపోయిందని పేర్కొన్నారు. తనకు కొండగట్టు పునర్జన్మను ఇచ్చిందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక పొత్తులపై స్పందించిన పవన్ కళ్యాణ్.. 2014 కాంబినేషన్ పునరావృతంపై కాలమే సమాధానం చెబుతుందని దాటవేశారు. వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయంటే పొత్తులపై మాట్లాడవచ్చని స్పష్టం చేశారు. ఎవరు వచ్చినా రాకున్నా ముందుకెళ్తామని.. ఎవరూ రాకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం అనుష్టుప్ నారసింహ యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను దర్శించుకోనున్నారు.