JanaSena: ఏపీలో ఓవైపు ఎండల వేడితో పాటు ఎన్నికల వేడి కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ ఇప్పుడు పిఠాపురం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే గతంలో వలె కాకుండా ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు ప్రత్యర్థిగా సీనియర్ నేత వంగాగీత ఉన్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురం నుంచి గెలిచిన వంగా గీత. ఇప్పుడు అదేస్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున బరిలో నిలిచారు. పవన్‌కు ప్రత్యర్థిగా ఉన్నారు. ఇప్పటివరకు పిఠాపురం అన్ని ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులు వెలువడడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. చాలా ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు పిఠాపురంలో ఓడిపోతూ రావడం ఒక ఆనవాయితీగా ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఆ ట్రెండ్ మారింది.
20 ఏళ్ల ఆనవాయితీకి ముగింపు పలుకుతూ ఓటర్లు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. అప్పుడు 14,992 ఓట్ల మెజారిటీతో పెండెం దొరబాబు గెలిచారు. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచిన వంగా గీత 2024 ఎన్నికల్లో మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పిఠాపురం నుంచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో వంగా గీత ఉన్నారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువ. కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువ. పిఠాపురంలో యు.కొత్తపల్లి మండలం చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతూనే ఉంటారు. 1972 తర్వాత చూస్తే ఎస్వీఎస్ఎన్ వర్మ(2014) మినహా కాపు నేతలే పిఠాపురం నుంచి గెలిచారు.
ప్రస్తుతం వైసీపీ తరఫున వంగా గీత పోటీ చేస్తుంటే.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున పవన్ కల్యాణ్ బరిలో ఉన్నారు. పవన్ కల్యాణ్ కాపు కులానికి చెందిన వారే. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానంటూ పవన్ ఇప్పటికే ప్రకటించారు. సొంత ఊరులా చేసుకుని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని పవన్ చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఇప్పటికే తన మేనిఫెస్టో ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్.
బీసీలు నిర్ణయాత్మకంగా ఉన్న చోట పవన్ ఎలా నెగ్గుకురాగలరనే దానిపై ఆయన విజయం ఆధారడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. “పవన్ కల్యాణ్‌కి పిఠాపురంలో సానుకూల అంశాలతో పాటుగా ప్రతికూలతలు కూడా అదే మోతాదులో ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారిని ఆయన ఎలా ఆకట్టుకుంటారన్నది కీలకం కానుంది.
2014లో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలుపులో బీసీలదే కీలక పాత్ర. కాపులకు, బీసీలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని పవన్ చక్కబెట్టగలిగితే ఇక్కడ పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువ. అర్బన్ ఓటర్లు ఎక్కవ ఉండడం కలిసొచ్చే అంశం. గెలుపు కోసం ఆయన టీడీపీ మీద ఆధారపడే పరిస్థితిలో ఉండడంతో ఏ మేరకు సహకారం దక్కుతుందన్నదే చూడాలంటున్నారు విశ్లేషకులు. పిఠాపురంలో ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు పవన్ కల్యాణ్. దాని కోసం అక్కడి టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా పూర్తి సహకారం అందిస్తున్నాడు.
పిఠాపురంతో ఉన్న అనుబంధం, స్థానికురాలు కావడం, సమస్యలపై అవగాహన ఉన్నందున ప్రజలు మళ్లీ తనకే పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి వంగా గీత భావిస్తున్నారు. కాపు ఆడపడుచుగా తనకు కాపులతో పాటు అన్ని కులాల్లో ఆదరణ ఉందని, అదే విజయానికి కారణం కాబోతోందని వంగా గీత ధీమా వ్యక్తం చేస్తున్నారు.
“పిఠాపురంలో కాపులు సుమారు 32 శాతం వరకూ ఉంటారు. అన్ని అంశాల్లో నిర్ణయాత్మక పాత్ర వారిది. భీమవరం, గాజువాకతో పోలిస్తే ఇక్కడ ప్రభావిత పాత్రలో ఉంటారు. భీమవరంలో క్షత్రియులకి అలాంటి శక్తి ఉంది. దాంతో గోదావరి జిల్లాల్లో ఈ రెండు సీట్ల మీద చివరి వరకూ కసరత్తులు చేసిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడానికి కారణం అని తెలుస్తుంది.