ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. బుధవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఏపీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. చెన్నైలో ఉన్నప్పుడు నాకెప్పుడు అలాంటి భావన కలగలేదు. విభజనవల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఆశలతో 2014లో ఏపీలో చంద్రబాబును సమర్థించా. కానీ మొత్తం తారుమారు అయింది. టీడీపీ పీకల్లోతు అవినీతిలో కూరుపోయింది. ప్రాజెక్టుల నుంచి ప్రతి చోట అవినీతి తాండవిస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఏపీని బాధిస్తోంది అన్నారు.’
ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. అందుకే రాజకీలయాల్లో మార్పు రావాలి. దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రముఖులను, మేధావులను కలిశా. నేను ఇప్పుడు తమిళనాడుకు రావడానికి కూడా కారణం ఉంది. తమిళనాడుకు జనసేనను పరిచయం చేద్దామని వచ్చా. ‘నా పేరు పవన్‌కల్యాణ్.. ఇది జనసేన’ ఇక్కడ నేను పలువురు తమిళ రాజకీయ నేతలను కలుస్తా. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాయి. అందుకే నిజమైన పార్టీల అవసరం ఇప్పుడు ఏర్పడింది. జల్లికట్టు కోసం మీరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించింది.
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లు భారతీయ రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నాయి. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్ట్రాల వారే నిర్ణయిస్తున్నారు. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి. రాజకీయాల్లో జవాబుదారీ తనం పెరగాలి. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవినీతి పేరుకుపోయింది. అది వైట్‌కాలర్ అవినీతి. ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యికోట్లపైనే అవినీతి జరిగింది. విభజన రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ గారూ మీకు నేను విన్నవించేది ఒక్కటే. దయ చేసి మీరు ఇచ్చిన మాటకు కట్టుబడండి. జవాబుదారీతనంతో ఉండండి.
‘ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మా పార్టీ స్టాండ్ ఎటువైపు తీసుకుంటోందో త్వరలోనే చెబుతా. నేను కూడా అందరినీ కలుస్తానేమో. చంద్రబాబు రిటైర్‌మెంట్ తీసుకునే సమయం దగ్గర పడింది. ఆయన కొడుకు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడు. అలాంటిది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ జనసేనదే’ అని అన్నారు..