పొత్తులపై లెక్క ఓ కొలిక్కి రాక జనసేన, లెఫ్ట్ పార్టీల నేతలు తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు లెఫ్ట్, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందన్నమాటే గానీ ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు పూర్తవలేదు. రేపు లెఫ్ట్, జనసేన పార్టీలు విడివిడిగా సమావేశమై వాళ్ల జాబితాను తెలియజేయబోతున్నాయి. ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న లెఫ్ట్, జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టాయి. రాయలసీమలో ప్రజాపోరాటయాత్ర తో పవన్ కల్యాణ్ బిజీగా ఉండటంతో పొత్తులపై భేటీలు సాధ్యం కాలేదు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన రెండుసార్లు సమావేశాలు జరిగినా అవి నామమాత్రంగానే ముగిశాయి.
జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో లెఫ్ట్ పార్టీల నేతలు మధు, రామకృష్ణ మూడోసారి చర్చలు జరిపారు. వామపక్షాల నేతలు తమ సీట్ల డిమాండ్లను జనసేన ముందుంచారు. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏయే సీట్లు ఇవ్వాలన్న దానిపై కూటమి, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీలోని 170 సీట్లలో కనీసం 30 సీట్లు అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. 13 జిల్లాల్లో పార్టీకి ఒక్కో సీటు చొప్పున 26 సీట్లతో పాటు అదనంగా మరో 4 సీట్లు ఇవ్వాలని కోరనున్నారు. అయితే జనసేన మాత్రం 12 నుంచి 15 సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు చేయాలంటున్నారు లెఫ్ట్ పార్టీల నేతలు. ఈ నెల 10 లేదా 11న లెఫ్ట్ పార్టీల నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.