జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 14న రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నిర్ణయించారు. తొలుత విజయవాడ వేదికగా సభ నిర్వహించాలని పవన్ భావించినా, అనేక అభిప్రాయాల అనంతరం వేదికను మార్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతోన్న జనసేన పలు దఫాలుగా మేనిఫెస్టోలో అంశాలను ప్రకటిస్తోంది. దీనిపై కసరత్తు సంతృప్తికర స్థాయిలో పూర్తయితే పార్టీ ఆవిర్భావ సభలోనే ప్రకటించే ఆస్కారం ఉంది. వామపక్షాలతో పొత్తులపై ప్రాథమికంగా చర్చలు జరిగినా, సీట్ల కేటాయింపు, ఎక్కడ పోటీచేయాలనే అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల్లో దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. నవతరంతో ఎన్నికలకు వస్తామని ఇప్పటికే ప్రకాశం, గుంటూరు సభల్లో జనసేనాని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల దరఖాస్తుల విషయంలోనూ మరింత లోతైన విశ్లేషణ చేయాలని పవన్ భావిస్తున్నారు.
కాగా, జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత గతేడాది తొలిసారిగా భారీ బహిరంగ సభను గుంటూరులో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేదికపై నుంచే తొలిసారిగా టీడీపీ ప్రభుత్వం, మంత్రి లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారు. మరోవైపు, రాజమహేంద్రవరంలో ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించడం వెనుక పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపొందే సీట్లపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, గోదావరి జిల్లాలపైనే పవన్ ప్రత్యేక దృష్టిసారించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.