ఏపీలో గ్రామ సచివాలయ పరీక్షా పత్రం లీకేజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షా పేపర్ లీకేజ్‌పై ఓవైపు టీడీపీ మండిపడుతుంటే మరోవైపు జనసేన కూడా ఆరోపణలు చేస్తోంది. పారదర్శకత, నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించామంటూ డైలాగులు చెప్పి భారీ కుంభకోణానికి తెర లేపిన జగన్ ప్రభుత్వం అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. మరోవైపు జగన్ ప్రభుత్వం కూడా దీనిపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి.
ఏపీలో ఎన్నడూ లేనంత స్థాయిలో లక్షా 28 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీ రాజ్ శాఖతో పాటు ఏపీపీఎస్సీ భారీ కసరత్తు చేశాయి. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాయి. తప్పు జరిగితే కఠిన చర్యలు తప్పవన్న సీఎం జగన్ ఆదేశాలే దీనికి కారణం. అయితే తప్పులకు అలవాటు పడిన కొందరు మాత్రం వేరేలా ఆలోచించారు. ప్రభుత్వం ఏమనుకున్నా పర్వాలేదు తాము నచ్చినవిధంగా వ్యవహరించాలని భావించారో ఏమో… ఏపీపీఎస్సీ అధికారులు మాత్రం ఈ పరీక్షలను లైట్ తీసుకున్నారు.
ఏపీపీఎస్సీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈ పేపర్ లీక్ చేసినట్లు వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనం. కొందరు ఉద్యోగులు చేసిన తప్పు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరీక్షల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసేలా కనిపిస్తోంది. దాదాపు 21 లక్షల మందికి పైగా అభ్యర్ధుల భవితవ్యంతో ముడిపడిన ఈ వ్యవహారంలో పేపర్ లీక్ అయిందనో, కాలేదనో స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం, అధికారులు, మంత్రులు మిన్నకుండిపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
పారదర్శకతతో, నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించాం అని డైలాగులు చెప్పి భారీ కుంభకోణానికి తెర లేపిన జగన్ ప్రభుత్వం! pic.twitter.com/MK0MrCpzEV
— JanaSena Party (@JanaSenaParty) September 21, 2019