పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన జనసేన పోరాట యాత్ర బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడగలిగే వ్యక్తినని స్పష్టం చేశారు. ‘2014 ఎన్నికల సమయంలో తన మద్దతు అడిగినప్పడు.. రాష్ట్రంలో బలమైన శాంతిభద్రతలు కావాలని చంద్రబాబును అడిగా. నేను ఏమీ ఆశించలేదు.. ఆడపిల్లలకు భద్రత ఉండాలని కోరుకున్నా. ఈతరం యువత పార్టీ.. ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
విభజన సమయంలో బాధ్యతతో కూడిన ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకున్నా. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మద్దతు ఇవ్వాలా? కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తులు, అసాంఘిక శక్తులు రాజ్యమేలుతుంటే.. వారి అరాచకాలకు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో 27కేసులు నమోదయ్యాయని, కేసుల చిట్టాను చదివి వినిపించారు. ఎమ్మెల్యేలను అదుపు చేయడంలో ముఖ్యమంత్రి వైఫల్యం చెందారని, వారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.దెందులూరులో పవన్ కల్యాణ్ సభ నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే చింతమనేని సభను అడ్డుకుంటారని ప్రచారం జరగడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.