జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎలాంటి స్వార్థం లేదని.. అదే ఉంటే 10 మందితో వెళ్లి ఏదైనా పార్టీలో కలిసేవాణ్ని అని వ్యాఖ్యానించారు. 2014లో కొంత మంది పార్టీని విలీనం చేయాలని కోరారని.. దానికి తాము ఒప్పుకోలేదని పవన్ చెప్పారు.
తిత్లీ తుపాను సమయంలో సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలోనే ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ మద్యపాన నిషేధం అమలు చేయలేరని.. మహిళలు ఆందోళన చేసే చోట్ల మద్యం దుకాణాలు వద్దని ఆయన సూచించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల అనర్థాలు వస్తాయన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పింఛను ఏటా రూ.250 పెంచుతామని ముందే చెప్పాల్సిందని.. అమలు చేయలేని హామీలు ఇవ్వడమెందుకని పవన్ ప్రశ్నించారు. కష్ట సాధ్యమైన హామీలు ఇచ్చిఉంటే తమ పార్టీ కూడా గెలిచేదన్నారు. అసెంబ్లీలో నాయకులు కొట్టుకోవడం ఒక్కటే తక్కువని ఆయన విమర్శించారు.
తమ దగ్గర డబ్బు లేదని.. కేవలం ఆశయ బలంతో వచ్చిన పార్టీ జనసేన అని పవన్ చెప్పారు. ఏదో ఒకరోజు దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. తాను బతకడానికి అవసరమైన డబ్బు ఉందని, దానికి ఇబ్బందేం లేదన్నారు. కానీ రాత్రిపూట నిద్రించే సమయంలోనూ, ఒంటరిగా ఉన్నప్పుడూ మనస్సాక్షి తనను చంపేసేదన్నారు. సమాజంలో తప్పులు జరుగుతున్నప్పుడు.. ఇన్ని అభిప్రాయాలు, పోరాటం చేయగలిగే ధైర్యం ఉండి కూడా వెనక్కి వెళ్లిపోవడమేంటని అనిపించేదన్నారు. చాలా మంది నేతలు తమ సీటు గెలిచి గిఫ్ట్‌గా ఇస్తామని తనతో చెప్తుండేవారని.. అలా గిఫ్ట్‌గా ఇవ్వడానికి రాష్ట్రం కేకు ముక్క కాదన్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిదైందని.. దీని వల్లే ఎవరు తన వాళ్లో అర్థమైందని పవన్ వ్యాఖ్యానించారు.