జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనని అన్నారు. నిన్న నరేంద్ర మోడీ, అమిత్‌షా లాంటి వాల్లే ఈ దేశానికి కరెక్ట్ అన్న పవన్.. ఈ రోజు మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసమే కేంద్రాన్ని వ్యతిరేకించాను, ప్రజలకోసం కేంద్రంతో విభేదించానే గానీ, బీజేపీతో దూరంగా లేనని వివరణ ఇచ్చారు. వైసీపీ నేతల విమర్శలకు సమాధానమిస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ, టీడీపీ వారితో కలిసి పోటీ చేసిఉంటే వైసీపీ నేతలు ఎక్కడ ఉండోవారో అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఎన్నోసార్లు కబురు పంపించారని అన్నారు పవన్.
ఇక, దుర్గమ్మ కొలువైన విజయవాడలో మూకుమ్మడి మత మార్పిడిలు జరుగుతుంటే సీఎం జగన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని విమర్శలు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసిన పవన్.. తిరుమలకు నేను వెళ్లి హే జీసస్ అంటే కుదరదు కదా? అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం అవసరమే.. కానీ.. తెలుగు మీడియాన్నితీసేస్తామంటే ఎలా అని ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ ప్రశ్నించారు. తెలుగు మీడియంలో చదువుకోవడానికి అవకాశం ఉండాలన్నారు. ప్రతీచిన్న విషయానికి నా మాటలను వక్రీకరిస్తున్నారని.. పవన్ మండిపడ్డారు. మొత్తానికి తాను బీజేపీకి ఎప్పుడు దూరంగా ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం.. ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది.. పవన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.