జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజధానికి సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదానికి ఆస్కారమిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పుపట్టరని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
”ఓవైపు రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాల కోసం ఆదేశాలు ఇవ్వడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే. రాజధానికి ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో ఇబ్బంది పడేది పేదలే. ఇతర జిల్లాల్లోనూ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూములు వివాదాల్లో ఉన్నాయి. అసైన్డ్ భూములు, శ్మశాన భూములు, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని వెల్లడిస్తోంది” అని పవన్ విమర్శించారు.