జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో భాగంగా పవన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులోని తోటి ప్రయాణికులతో పవన్ కాసేపు ముచ్చటించి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుద్ధగొమ్ము గిరిజిన ప్రాంతాలలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ అక్కడికి చేరుకోగానే స్థానిక గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతానికి వచ్చి వైద్యసేవలందించే వైద్యులకు రెట్టింపు జీతాలు ఇస్తామన్నారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే గంజాయి సాగు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పవన్ కు గిరిజనులు సంప్రదాయ తలపాగాను బహూకరించారు. పవన్ తలపాగాను ధరించి డోలును వాయిస్తూ.. గిరిజనులతో కలిసి చిందేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను జనసేన తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
JanaSena Chief @PawanKalyan Dance with Suddhagommu Tribal villagers #BusJourneyWithJANASENANIhttps://t.co/HOqSUQeLRB
— JanaSena Party (@JanaSenaParty) November 25, 2018