జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఈనెల 12న కాకినాడలో దీక్ష చేస్తానని.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా చేయిదాటతాయో చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పవన్ మాట్లాడారు. రైతు కష్టం నుంచి మరింత కష్టాల్లోకి వెళ్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చుపెడుతున్నారని.. రైతును ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ధాన్యం విక్రయించిన రైతులకు రసీదులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తిట్లు మాని మంచిపనులు చేయాలని హితవు పలికారు.
ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. అరుపులు, కేకలతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసైనికులకు క్రమశిక్షణ లేకే ఓడిపోయానని ఆయన వ్యాఖ్యానించారు. ”అన్నం పెట్టే రైతు కష్టాలు చెబుతున్నపుడు మీరు అరుస్తుంటే నాకు ఎలా వినిపిస్తుంది?నిజంగా ఇబ్బందిగా ఉంది. క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది.. అది మర్చిపోకండి. క్రమశిక్షణ ఉండుంటే.. జనసేన గెలిచి ఉండేది” అని పవన్ మండిపడ్డారు.