సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ సందడి మొదలైంది. ఇంకా ఎన్నికలకు నెల రోజుల మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. టీడీపీ, వైసీపీ ఇప్పటికే జాబితాలను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వామపక్షాలతో కలిసి 2019 ఎన్నికలకు వెళ్తున్నట్టు గతంలోనే స్పష్టంచేసిన పవన్ కల్యాణ్ తమ పార్టీ నుంచి రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తమ పార్టీ కార్యవర్గం ఆచితూచి సిద్ధంచేసిన 32 మంది అసెంబ్లీ, తొమ్మిది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తానంటూ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే పవన్‌కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
అమలాపురం నుంచి ఓఎన్జీసీ విశ్రాంత అధికారి డీఎంఆర్ శేఖర్, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణను బరిలో దింపుతున్నట్టు వెల్లడించారు. డీఎంఆర్ శేఖర్ తమ పార్టీలో చేరడం వ్యక్తిగతంగా తనకెంతో ఆనందంగా ఉందని పవన్ అన్నారు. 2014లో తమ పార్టీ ఆవిర్భావ సభకు కూడా ఆయన తన సన్నిహితులతో కలిసి వచ్చారని, తమ ఇద్దరి భావజాలం కలిసిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణతోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వీరిద్దరూ ఎంపీలుగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ ఆకాంక్షించారు.