నటీనటులు: ఎన్టీఆర్, నివేదా థామస్, రాశిఖన్నా, రోనిత్ రాయ్, ప్రియదర్శి, హంసానందిని తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: చోటా కే నాయుడు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: కల్యాణ్ రామ్
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో ‘జై లవకుశ’ సినిమా ద్వారా తెరపై తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని తెలిసినప్పటి నుండి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా..? అనే ఆసక్తి ఆడియన్స్ లో పెరిగిపోయింది. భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
జై, లవ, కుశ ముగ్గురు కూడా కవల పిల్లలు. చిన్నప్పటి నుండి నాటకాల్లో ప్రావీణ్యం పొందిన ఈ ముగ్గురిలో పెద్దవాడైన జై కు నత్తి ఉన్న కారణంగా లవకుశలకు వచ్చేంత గుర్తింపు లభించదు. తను ప్రేమగా చూసుకునే తమ్ముళ్ళు కూడా తనను చిన్న చూపుతో చూడడం జై భరించలేకపోతాడు. దీంతో తన గుర్తింపు తనే సంపాదించుకోవాలని రావణుడిగా చాలా క్రూరంగా మారిపోతాడు. చిన్నప్పుడే తన తమ్ముళ్లను చంపాలనుకుంటాడు. కానీ వారిద్దరు బ్రతికే ఉంటారు. అయితే ముగ్గురు కూడా విడిపోతారు. జై.. రావణుడిగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతుంటాడు. లవుడు బ్యాంక్ మేనేజర్ గా కుశుడు దొంగతనాలు చేస్తూ బ్రతుకుతుంటారు. అయితే తన పంతాన్ని నెగ్గించుకోవాలనుకునే జై.. తన ఇద్దరి తమ్ముళ్లను కిడ్నాప్ చేయిస్తాడు. అసలు జై.. తన తమ్ముళ్లను ఏం చేయాలనుకుంటాడు..? చిన్నప్పుడే చంపాలనుకున్న ఆ ఇద్దరికీ ఇప్పుడు ఎలాంటి హాని కలిగిస్తాడు..? చివరకు జై మంచివాడిగా మారాడా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
ముగ్గురు అన్నదమ్ముల నేపధ్యంలో దర్శకుడు రాసుకున్న లైన్ కొత్తగా ఉన్నప్పటికీ దాని చుట్టూ అల్లిన కథలో కొన్ని తప్పులు దొర్లాయి. ఆకట్టుకునే కథనంతో సినిమా నడిపించలేకపోయాడు. సినిమా మొదటి భాగం రొటీన్ గానే సాగింది. ఎప్పుడైతే జై పాత్ర కథలోకి ఎంటర్ అవుతుందో.. అప్పటినుండి సినిమాపై క్యూరియాసిటీ కలుగుతుంది. సినిమా బాగుంది అనుకునేలోపు మళ్ళీ రొటీన్ దారిలో తీసుకెళ్ళి అక్కడక్కడా విసిగించాడు. సినిమా మొదటి భాగంలో ఒకట్రెండు
కీలక సన్నివేశాలు తప్ప చెప్పుకునే విధంగా ఏమీలేవు. ఇక సెకండ్ హాఫ్ లో జై తన తమ్ముళ్లను తన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడానికి రప్పించిన తీరు పరమ రొటీన్ గా అనిపిస్తుంది.
అయితే అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్ని పెట్టి దర్శకుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. నిజాయితీ, మంచితనంతో కూడిన లవుడు పాత్రను, చిలిపితనంతో కూడిన కుశుడు పాత్రను, క్రూరత్వంతో నిండిన జై ఇలా మూడు పాత్రలను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక అటువంటి మూడు పాత్రల్లో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. తన నటనతో మూడు పాత్రలకు న్యాయం చేశాడు. జై పాత్రలో ఎన్టీఆర్ వేషధారణ, ఆయన పలికే
డైలాగ్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఎన్టీఆర్ తన హావభావాలను చక్కగా పలికాడు. పెర్ఫెక్ట్ నటుడు అని ఎన్టీఆర్ ను ఉదాహరణగా చెప్పొచ్చు. అంతగా తన నటనలో పెర్ఫెక్షన్ ను చూపించాడు. రాశిఖన్నా, నివేదా థామస్ ల పాత్రలు చెప్పుకునే స్థాయిలో లేవు. కేవలం పాటలకు పరిమితం అయ్యారు. రోనిత్ రాయ్ లాంటి బాలీవుడ్ నటుడు స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదు.
సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. పాటలు మాత్రం ఏవరేజ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రేటింగ్: 3/5