AP Elections 2024: విశాఖపట్నం ఆనందపురంలోని ఓ కన్వెన్షన్ హాలులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ సమావేశం అయ్యారు. వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు దీనికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమిపై విమర్శలు గుప్పించారు. టీడీపీ- దాని మిత్రపక్షాలు సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తోన్నాయని అన్నారు. తనపై భౌతికంగా కూడా దాడులు చేయించారని పేర్కొన్నారు. వీటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ గెలుపు విషయంలో దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్టే రాశాడని జగన్ వ్యాఖ్యానించారు.
దేవుడి ఆశీస్సులు, ప్రజల అండదండలు తనకు తోడుగా ఉన్నాయని పేర్కొన్నారు. టీడీపీ కూటమి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తోన్నామని జగన్ చెప్పారు. ఈ యుద్ధంలో తాను ఒక్కడిని ఒకవైపు ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర రాజకీయ పార్టీలు మరో వైపు ఉన్నాయని, ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నానని జగన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము విజయానికి దగ్గరగా ఉన్నామనే అక్కసుతోనే దాడి తీవ్రతరం చేశారని అన్నారు
తెనాలిలో గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రధాన మీడియా లేకపోయినా సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉందని జగన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారాయన.
తమ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా ఓ యాప్‌ను రూపొందించాలని, ప్రతివారం ఇలాంటి అంశాలు తన దృష్టికి తీసుకురావాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవకు సూచించారు. సోషల్ మీడియా ప్రతినిధులకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో గెలిచిన తరువాత తాను విశాఖపట్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ పునరుద్ఘాటించారు. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాననీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా వచ్చి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తే- బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుందని అన్నారు. ఏపీకి డెస్టినేషన్‌గా విశాఖ ఆవిర్భవిస్తుందని చెప్పారు.
ఇందులో భాగంగా.. ఒక యువతి జగన్‌ను ఓ ప్రశ్న అడిగింది. ‘సర్… మీరు పొలిటీషియన్ అవకముందు ఒక మంచి వ్యాపారవేత్త! కానీ ఇప్పుడు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? యువత మీలాగా ఎంటర్‌ప్రెన్యుయర్ కావాలంటే మీరు ఏమని సలహా ఇస్తారు అని అడిగింది.
దీనికి వైసీపీ సోషల్ మీడియా సారథి సజ్జల భార్గవ రెడ్డి.. బదులిస్తాను. ఆయన రాజకీయ ప్రస్థానం ఎంత ఇన్‌స్పైరింగో… ఎంట్రప్రెన్యూర్ జర్నీ కూడా అంతే ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఇంటర్నెట్‌లో చూడండి! ఆయన జీవితం ఒక పాఠంలాంటిది’ అన్నారు.