నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ .. జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్ష, వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీ అభిమానులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, వైసీపీ శ్రేణుల సమక్షంలో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
స్టేడియంలోపలికి రాలేకపోయిన అభిమానులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా 14 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. జగన్ సభాస్థలికి చేరుకున్న సమయంలో వైసీపీ నేతలు హెలికాప్టర్ ద్వారా పూలు జల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
అంతకుముందు జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. మైదానంలో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు జగన్అ భివాదం చేశారు.