ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి .. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. చట్టాలు చేసే సభలో చట్టాలను మనమే గౌరవించాలని ఆయన అన్నారు. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేశారు.
సభలో ఎలా ప్రసంగించాలి అనే అంశంపై అందరికీ అవగాహన అవసరమని జగన్ అన్నారు. ఏవిధంగా ప్రసంగిస్తే ఆకట్టుకునే రీతిలో ఉంటుందనేది అందరూ తెలుసుకోవాలని చెప్పారు. ఒక సబ్జెక్ట్‌పై మనం మాట్లాడుతున్నప్పుడు పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. ఏయే సబ్జెక్టులపై ఎవరు మాట్లాడాలని అనుకుంటున్నారో ముందుగా జాబితా ఉంటుందని, సమాచారం లేకుండా మాట్లాడితే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. మనం తప్పు మాట్లాడితే ఇతరులు ప్రశ్నించే వీలుంటుందని, అప్పుడు దానిపై మళ్లీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని జగన్ అన్నారు. పార్టీలోని ఇతర సభ్యులతో సమన్వయం చేసుకుంటూ మాట్లాడాలని కోరారు.
టీడీపీ నుంచి ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కొందరు తనతో చెప్పారని సీఎం జగన్ అన్నారు. మనం ఇతర పార్టీ నుంచి తీసుకుంటే వాళ్లకు మనకూ తేడా ఏం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇతరులు వస్తే ఆ పార్టీకి రాజీనామా చేసి వస్తే తప్ప మనం తీసుకోమన్నారు. గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగా తాము ప్రవర్తించబోమని, అసెంబ్లీని హుందాగా నడిపిస్తామన్నారు. చట్ట సభలో చేసే సభలో చట్టాలను గౌరవించేలా వ్యవహరిద్దామని నేతలకు సూచించారు.