ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఆమె జపాన్ క్రీడాకారిణి ఒకుహరను చిత్తుగా ఓడించి గెలుపొందారు. 2013, 2014లో కాంస్యం, 2017, 2018లో రజతం సాధించిన సింధు 2019లో స్వర్ణం దక్కించుకున్నారు. ఈ మేరకు ఆమె జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు బాలీవుడ్‌లో సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్నట్లు చెబుతున్నారు.
ఇదే విషయం గురించి తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్ గోపీచంద్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నాకు అక్షయ్ కుమార్ అంటే ఇష్టం. నిజంగా ఆయన నా పాత్రను పోషిస్తే.. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. నేను ఎంతో అభిమానించే వ్యక్తుల్లో ఆయన ఒక్కరు. కానీ బయోపిక్‌పై నాకు స్పష్టత లేదు’ అని చెప్పారు.
భారత బ్యాడ్మింటన్ జట్టుకు గోపీచంద్ చీఫ్ నేషనల్ కోచ్‌గా ఉన్నారు. ఆయన్ను 1999లో అర్జున, 2001లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009లో ద్రోణాచార్య, 2014లో పద్మభూషణ్‌అవార్డులు వరించాయి. ఆదివారం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం గెలుపొందిన సందర్భంగా అక్షయ్ కుమార్ ఆమెను ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఇది ఓ గొప్ప విజయమని పేర్కొన్నారు.