Homeతెలుగు Newsరేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నిన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్‌ చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. అయినప్పటికీ 11 మంది సభ్యులు గల ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేసింది.

8 28

మరోవైపు కొడంగల్‌లోని రేవంత్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈరోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈరోజు ఉదయం 9-10 గంటల మధ్య ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది.

అయితే తన రియల్‌ ఎస్టేట్‌ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి కొద్దిరోజుల క్రితమే వ్యాఖ్యానించారు. తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్రలకు తెరతీస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.

8a 6

మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో కాంగ్రెస్‌ రేవంత్‌ రెడ్డి ఉద్వేగంతో ప్రసంగించారు. తన నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. అంతకుముందు కోస్గిలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇదే తన చివరి ఉపన్యాసం కావొచ్చని తెలిపారు. జైలులో ఉన్నా.. ఎక్కడ ఉన్నా కొడంగల్‌లో నామినేషన్‌ వేస్తానని స్పష్టంచేశారు. 50 వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించాలని కార్యకర్తలను కోరుకుంటున్నానన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు. ప్రధాని మోడీ, కేసీఆర్‌ కలిసి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ రోజు తన నివాసాల్లో సోదాలు నిర్వహించారు అని అన్నారు. ఎవరు ఎన్నికుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరన్నారు.

రేవంత్‌రెడ్డి నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం నుంచి ఆదాయపన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సోదాలు జరిగాయి. కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి రావాలని ఐటీ అధికారులు సమాచారమందించారు. దీంతో కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని రేవంత్‌రెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. రేవంత్‌ కోసం రెండుగంటల నుంచి ఎదురు చూస్తున్న అధికారులు ఆయన రాగానే నివాసంలోకి తీసుకెళ్లారు. రేవంత్‌ వస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీ అధికారులను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రేవంత్‌ నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్రలకు తెరతీస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu