అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఊడ్చేసింది. ఈ ఫలితాలపై పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. తనను కొడుకుగా భావించి ప్రజలు ఓటేశారని, ఇది వారి విజయమేనంటూ ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
‘ఆమ్ ఆద్మీపై విశ్వాసం ఉంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. ఐ లవ్‌యూ ఢిల్లీ. ఇది యావత్ భారతావని విజయం. ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో ‘పని రాజకీయం’ పురుడు పోసుకుంది. ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్యుత్, నీటిసరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి. విద్య, వైద్యం కోసం మేం చేసిన కృషిని గుర్తించి ప్రజలు మమ్మల్ని ఆదరించారు. మరో అవకాశం కల్పించారు. మరో ఐదేళ్ల పాటు మనమంతా కలిసి పనిచేద్దాం’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఈ సందర్భంగా భార్య సునీత కేజ్రీవాల్, భగవాన్ హనుమాన్‌కు కేజ్రీవాల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమను సరైన మార్గంలో నడిపించాలని నిత్యం హనుమంతుడికి ప్రార్థనలు చేశామని, దాని వల్లే ప్రజలకు మరో ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం లభించిందన్నారు.
#WATCH Delhi: AAP chief Arvind Kejriwal at the party office says, “Dilli walon ghazab kar diya aap logon ne! I love you.” #DelhiElectionResults pic.twitter.com/8LeW9fr4EL
— ANI (@ANI) February 11, 2020