బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ 75ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘కూలీ’ ఒకటి. అమితాబ్ జీవితంలోనే మర్చిపోలేని సినిమా అది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో గాయపడ్డ అమితాబ్ చావు అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చారు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా 37ఏళ్లు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన ఈరోజు ఆయన తన రెండో పుట్టిన రోజుగా భావిస్తారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఓ భావోద్వేగపు పోస్ట్ చేశారు.
‘ప్రేమ, గౌరవం, ప్రార్థనలతో కూడిన ఈరోజు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. దయా హృదయాలతో వారు చేసిన ప్రార్థనలు నాకు దీవెనలై నాతో ఉన్నాయి. వారు చూపిన ప్రేమాభిమానాలు ఇప్పటికీ నాతోనే ప్రయాణిస్తున్నాయి. ఇది ఎప్పటికీ నేను తీర్చుకోలేని రుణం’ అని అమితాబ్ ట్వీట్ చేశారు.
జులై 26, 1982న ‘కూలీ’ షూటింగ్ బెంగళూరు యూనివర్సిటీలో జరిగింది. ఓ యాక్షన్ సన్నివేశంలో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలో అనేక చోట్ల అంతర్గతంగా గాయాలయ్యాయి. అనంతరం వెంటనే ఆయనను ముంబయికు తరలించారు. తనకు వెంటిలేటర్ పెట్టే సమయానికి వైద్య పరంగా తాను చనిపోయినట్లు వైద్యులు తెలిపారని ఓ సందర్భంలో బ్లాగ్‌లో రాసుకొచ్చారు అమితాబ్. ఆయన బతకాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు, లక్షలాది అభిమానులు గుళ్లు, మసీదులు, చర్చిలకు వెళ్లి దేవుడిని ప్రార్థించారు. ఆగస్టు 2న ఆయన స్పృహలోకి వచ్చారు.