మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ బాక్సాఫీసు వద్ద కోట్లు రాబడుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ఓ వివాదం చుట్టుముట్టింది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ తనదేనంటున్నాడు హీరో, రచయిత ఆకాష్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన సినిమా ఇది. ఓ వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే కాన్సెప్ట్‌తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కింది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్లకు పైగా రాబట్టిందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ కాన్సెప్ట్ తనదేనంటున్నాడు ఆనందం ఫేం ఆకాష్.
ఇదే కాన్సెప్ట్‌తో తెలుగు, తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో నన్నే హీరోగా పెట్టి దర్శకురాలు రాధా ఓ సినిమా తీశారు. ఆ చిత్రం తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’పేరుతో విడుదలైంది. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో షాక్ తగిలింది. ఈ విషయమై పూరీ జగన్నాథ్‌ను సంప్రదించాలని ప్రయత్నించాం. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో తమిళ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసి, సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని చెప్పారు. అంతేకాదు ఆయన తన వాదనను వినిపించి, ఆధారాలను కూడా మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కాని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.