వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ చిత్రం టైటిల్ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికెట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్ స్టర్‌తో పోల్చడం వల్ల ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దాంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. లేకపోతే బోయ కమ్మూనిటీ అంతా ఒక్కటి అవుతుందని.. అందుకు నిర్మాతలు, డైరెక్టర్, నటులు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు.
మా జాతికి గురువైన వాల్మీకిని ఈ సినిమా ద్వారా రాబోయే తరాలకు గ్యాంగ్‌స్టర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి బోయ ఆరోపించారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు రాం అచంట, గోపి అచంటలను కలిసి టైటిల్ మార్చమని కోరామన్నారు. అంతేకాక హీరో వరుణ్‌ని కూడా కలిసామని కానీ వారు స్పందించలేదని తెలిపారు. టైటిల్ మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వమని హెచ్చరించారు.ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.