Tollywood Comedians: టాలీవుడ్‌లో కమెడియన్‌లు హీరోలుగా మారడం అనేది కొత్తేం. గతంలో అలీ, సునీల్, వేణు మాధవ్, ఇలా పలువురు హీరోలుగా నటించారు. వీరిలో అలీ హీరోగా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సునీల్ కూడా హీరోగా తన మొదటి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి కమెడియన్‌లు ఓ వైపు హాస్యనటులుగా చేస్తునే.. హీరోలుగా కూడా దూసుకుపోతున్నారు.
టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్‌ల్లో సునీల్ ఒకరు. ఒక టైమ్‌లో ఆయన లేని సినిమా లేదంటే.. అతిశయోక్తి కాదు. ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా మారిపోయాడు సునీల్. ఈ సినిమా సునీల్‌కి హిట్‌ని ఇచ్చింది. అయితే ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా కలిసిరాలేదు. దీంతో మళ్లీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. ఒక పక్క సీరియస్ పాత్రలతో పాటు కామెడీ రోల్స్ లో కూడా అదరగొడుతున్నారు. జైలర్ సినిమా సునీల్ కు తమిళ్ లో కూడా మంచి రీచ్ తీసుకొచ్చింది. తెలుగులో సునీల్ హీరోగా నటించేందుకు కొన్ని సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరకీ దగ్గరయ్యాడు ప్రియదర్శి. అందులోని తన కామెడీ టైమింగ్ కొత్తగా ఉండటంతో.. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు చేశాడు. ‘మల్లేశం’తో హీరోగా నటించాడు. ‘బలగం’ సినిమా ప్రయదర్శికి మంచి పేరుతీసుకొచ్చింది. ఇటీవలే ‘ఓం భీమ్ భుష్’ సినిమాలో నటించాడు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇక ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరిస్ తో మంచి జోష్ లోకి వచ్చాడు. త్వరలో ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పొలిమేర’ మూవీకి మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా ఓటీటీలో విడులైంది. పొలిమేర 2 థియేటర్లలోకి వచ్చి నిర్మాతలకు లాభాలు మిగిల్చింది. నిజానికి తను మంచి టైమింగ్ వున్న ఆర్టిస్ట్. కామెడీతో పాటు అన్నీ భావాలు పలికించగలడు. అయితే సరైన విజయాలు లేక డల్ అయిన అతని కెరీర్ కి పొలిమేర ఫ్రాంచైజ్ జోష్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ మధ్య టెనెంట్ అనే సినిమా వచ్చింది. ఇంకొన్ని నిర్మాణ దశలో వున్నాయి.
వెన్నెల కిషోర్ కెరీర్ కూడా మంచి జోరులో వుంది. పెద్ద సినిమాల్లో కామెడీ పాత్రలకు ఆయన ఫస్ట్ ఛాయిస్. ఆయన కామెడీ టైమింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. మరోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే ఛార్లీ సినిమా చేశాడు. ఈ సినిమా థియేటర్స్ లో సరిగ్గా ఆడకపోయినప్పటికీ ఓటీటీ రేటు కిట్టుబాటైయిందని తెలుస్తోంది.
టాలీవుడ్ లో బిజీ కమెడియన్ లో సత్య ఒకరు. సత్య కామెడీతో సేవ్ అయిన సినిమాలు వున్నాయి. రంగబలి ఫస్ట్ హాఫ్ బావుందని టాక్ రావడానికి కారణం సత్య టైమింగ్. ఇటీవలే విడుదలైన గీతాంజలి 2 కి కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ వచ్చిందంటే కారణం సత్యనే. తను హీరోగా వచ్చిన వివాహభోజనంబు ఓటీటీలో హిట్. ఈ సినిమా కూడా మంచి టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు సత్య కోసం కథలు రాస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది.
సప్తగిరి కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే హీరోగా టర్న్ తీసుకున్నాడు. జయాపజయాలు పక్కన పెడితే హీరోగా చేయడానికే మొగ్గు చూపుతున్నాడు. జబర్దస్త్ వేదికగా వచ్చిన హాస్యనటులు కూడా ఫుల్ బిజీగా వున్నారు. వేణు కూడా.. బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. హీరోనానితో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాడు.
ధనరాజ్ కూడా మెగా ఫోన్ పట్టాడు. సముద్రఖని ప్రధాన పాత్రలో ‘రామం రాఘవం’ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నాడు. శకలక శంకర్, సుడిగాలి సుదీర్ హీరోలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైపర్ అది పెద్ద సినిమాల్లో కామెడీ పాత్రల్లో మెరుస్తున్నాడు. అభినవ్ గోమటం ఇటీవల ‘డియర్ దొంగ’ గా మెరిశాడు. ఓటీటీలో కొన్ని కథలు ఆయన కోసం రెడీ అవుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు తెలుగు హాస్యనటులు మళ్ళీ బిజీ అయ్యారు. పారితోషకం కూడా పెంచేశారు. వాళ్ళ డేట్స్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఇందులో చాలా మంది నటులు చిన్న సినిమాలకి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది.