GOAT climax scene:
వెంకట్ ప్రభు దర్శకత్వంలో, దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT) చిత్రం గత గురువారం విడుదలై మిశ్రమ స్పందనతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఫ్యాన్స్ విడుదలకు ముందు వరకు ఈ సినిమా మీద మంచి ఆశలు పెట్టుకున్నారు కానీ.. విడుదలయ్యాక మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం 2018లో విడుదలైన ఫైనల్ స్కోర్ సినిమాలోని ఒక సన్నివేశానికి చాలా దగ్గరగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ది GOAT క్లైమాక్స్ సన్నివేశం ఫైనల్ స్కోర్ చిత్రంలోని సన్నివేశాన్ని పోలి ఉందని, ముఖ్యమైన మార్పులు ఏంటి అంటే.. ఫుట్ బాల్ స్టేడియం నుండి క్రికెట్ స్టేడియానికి మార్చి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రస్తావన పెట్టడం మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పోలికకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దర్శకుడి ఒరిజినాలిటీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దర్శకుడు వెనకట్ ప్రభు ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
విజయ్ పాటు, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవా, జయరామ్, ప్రసాద్, లైలా, మోహన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సినిమా కథ, స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్ సన్నివేశంపై బాగానే విమర్శలు వస్తున్నాయి. ఈ క్లైమాక్స్ వివాదం సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.