బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ముంబయి నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారట. ఇర్ఫాన్ ఖాన్‌ను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పలు ఆంగ్ల వెబ్‌సైట్లు కథనం రాశాయి. ఈ నేపథ్యంలో ఆయన కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా ట్విటర్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.
గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్ అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2018 మార్చిలో ఆయన తన అనారోగ్య పరిస్థితి గురించి ప్రకటించి, అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఆపై యూకేలో చికిత్స చేయించుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించారు. మార్చిలో విడుదలైన ఈ సినిమా కరోనా నేపథ్యంలో బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత ఇర్ఫాన్ కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయలేదు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) శనివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబయిలో చిక్కుకున్న ఇర్ఫాన్ ఖాన్ జైపూర్‌లో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.