గత ప్రభుత్వ కీలక నిర్ణయాలపై విచారణకు వైసీపీ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండు, మూడు రోజుల్లో రంగంలోకి దిగనుంది.గత ప్రభుత్వం అమలు చేసిన కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, దర్యప్తు కోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.శాఖపరంగా డీజీపీ కార్యాలయం నుంచి రావాల్సిన ఆదేశాలు సిట్ అధిపతికి, సభ్యులకు ఇంకా అందలేదు.అవి వచ్చిన వెంటనే సోమ లేదా మంగళవారం సిట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశముంది.ముందు బృందం సభ్యులంతా సమావేశమై ఎవరెవరు ఏమేం చేయాలో బాధ్యతలు పంచుకోనున్నారు.
ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు, సమన్వయం.. ఏపీలోని ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం, సమాచార సేకరణ, దర్యాప్తులో గుర్తించిన బాధ్యుల విచారణ, వాంగ్మూలం నమోదు తదితర బాధ్యతలు విభజించుకోనున్నారు.సిట్ బృందం ఎక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుందనే విషయమై ఇంకా స్పష్టతలేదు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఓ గది కేటాయిస్తారా? తెలియాల్సి ఉంది.సిట్‌కు పోలీసు స్టేషన్ హోదా కల్పించి.. కేసుల నమోదు అధికారమూ ఇచ్చినందున అందుకు అవసరమైన ప్రక్రియల్ని పూర్తి చేయటం, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అధ్యయనంపై తొలుత సిట్ దృష్టి సారించనున్నట్లు సమాచారం.