YS Viveka Murder Case: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న ఈనేపథ్యంలో.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయ వేడిని రాజేస్తోంది. అధికార ప్రతిపక్షాలు.. వివేకా హత్య కేసుపై పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు వివేకా హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినేనని ఆరోపిస్తున్నారు. దీంతో వివేకా మర్డర్ కేసుపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వివేకా హత్యకు సంబంధించిన కేసు ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో అరెస్ట్‌లు, అనుమానితుల విచారణ, సాక్షుల విచారణ ఇప్పటికే జరిగాయి.
కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై మాటల దాడి పెంచేందుకు విపక్ష పార్టీల నేతలు వివేకా హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన తీసుకురావడాన్ని ఖండిస్తూ వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంపై ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో సురేష్ బాబు కోర్టును కోరారు.
సురేష్ బాబు వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన కడప కోర్టు.. ప్రతిపక్ష నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడకూదని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య ప్రస్తావన తీసుకురావొద్దని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతలను కడప కోర్టు ఆదేశించింది.