ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అంటే తెలియని వారుండరు. పారిశ్రామిక వేత్తగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడిగా సుప్రసిద్ధులు నారాయణమూర్తి. ఇన్ఫోసిస్‌ను స్థాపించి దానిని ఏ స్థాయికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు.
ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ నటి కరీనాకపూర్ గురించి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓసారి తాను లండన్ నుంచి వస్తుండగా విమానంలో నారాయణమూర్తి పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారట. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి కరీనాను పలకరించారట. కానీ ఆమె స్పందించలేదట.
తాను కనీసం స్పందించకపోవడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే అని ఆయన అన్నారు.
కరీనా కపూర్‌ను నారాయణ మూర్తి తప్పుబట్టగా ఆ వ్యాఖ్యలను ఆయన సతీమణి సుధామూర్తి విభేదించారు. ఓ చర్చాకార్యక్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘కరీనాకు కోట్ల మంది అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉండొచ్చు. ఓ సాఫ్ట్‌వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్ అయిన నారాయణ మూర్తికి 10 వేల మంది అభిమానులు ఉంటారేమో! కానీ సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా’ అని కరీనాకు మద్దతుగా మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.
అప్పుడు నారాయణ మూర్తి వివరణ ఇస్తూ ‘ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి. అది ఏ రూపంలోనైనా సరే తిరిగి చూపించడమనేది చాలా ముఖ్యం’ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.