దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. కానీ చాలా చోట్ల ప్రజలు నిబంధలను ఉల్లంఘిస్తూ వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలాచోట్ల ప్రజలకు కరోనా తీవ్రతపై అవగాహన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ తీవ్రత గురించి పోలీసులు, అధికారులు, మీడియా అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేపట్టారు. కరోనా రూపంలో ఉండే ఓ హెల్మెట్‌ను తయారు చేశారు. దీనిని పోలీసులు ధరించి రోడ్లపై వెళ్తున్న వాహనదారులను ఆపి కరోనా వైరస్ తీవ్రతను తెలియజేస్తున్నారు. ఓ కళాకారుని సహాయంతో దీనిని రూపొందించారు. కరోనా వైరస్ రూపంలో ఉన్న దీనినిచూడగానే దాని ప్రభావం ఎలా ఉంటుందో గుర్తుకు రావాలని ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ఈ వినూత్న హెల్మెట్‌ను చూసి చిన్నపిల్లలు ఆకర్షణకు గురవుతున్నారని అది ధరించిన పోలీసు అధికారి పేర్కొన్నాడు. దీంతోపాటుగా ప్లకార్డులతోనూ అవగాహన కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు.