HomeTelugu Newsసెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌

సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌

2 30
ప్రముఖ పారిశ్రామికవేత్త, జగన్‌ ఆస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్ళిన ఆయనను సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి రస్‌ అల్‌ ఖైమా (రాక్‌) దేశంలో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. ఆ మేరకు ఆయనను నిర్బంధించినట్లు తెలుస్తోంది.

సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్ట్‌ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ ధ్రువీకరించింది. అరెస్ట్‌ గురించి అక్కడి భారతీయ రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు ఆధారంగా అక్కడ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నాయి. నిమ్మగడ్డ కుమారుడు, లాయర్‌తో భారతీయ దౌత్య అధికారులు మాట్లాడినట్లు తెలిపాయి. సెర్బియన్‌ చట్టాలను పరిశీలించి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించినట్లు వివరించాయి.

వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్‌కు, రాకియా(రస్‌ అల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ)కు మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. దర్యాప్తులో భాగంగా ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా భారతదేశం అనుమతి తీసుకోవాలి. అయితే జగన్‌ ఆస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌పై సీబీఐ, ఈడీలలో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయనను విదేశానికి అప్పగించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకోదు. ఒకవేళ ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయిస్తే నిమ్మగడ్డ ప్రసాద్‌ అప్రమత్తమై విదేశీ పర్యటనలు మానుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రస్‌ అల్‌ ఖైమా పోలీసులు చాలాకాలంగా ప్రసాద్‌ విదేశీ పర్యటనలపై కన్నేసి ఉంచారని, ఐరోపాలో ఉన్న సంగతి తెలుసుకొని ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించారని తెలుస్తోంది. దాంతో బెల్‌గ్రేడ్‌ విమానాశ్రయంలో దిగగానే అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu