ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ సదస్సుకు హాజరైన 2,550 మంది విదేశీ తబ్లీగీలపై కేంద్రం నిషేధం విధించింది. వీరు పదేళ్లపాటు భారత్‌కు రాకుండా చర్యలు తీసుకుంటోంది. మత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వీరంతా వీసా నిబంధనలు ఉల్లంఘించి రహస్యంగా మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విదేశీ తబ్లీగీలపై ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈ తబ్లీగీలంతా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండొనేషియా తదితర దేశాలకు చెందినవారు. ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న తబ్లిగీ జమాత్ కార్యకర్తలు ఆపై దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కరోనా వ్యాప్తి ఎక్కువైందని కథనాలు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ సదస్సుకు వీరంతా హాజరయ్యారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోవడం ప్రమాదకరంగా మారింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత సదస్సు జరిగిన భవనం నుంచి అధికారులు వేలాది మంది తబ్లిగీలను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. మర్కజ్ సదస్సుకు హాజరైన తబ్లిగీలకు వారి కుటుంబీకులకు కరోనా సోకింది. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ట్రేస్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి చాలా సమయం పట్టింది. ఈలోగానే కరోనా మహమ్మారి మరింత విజృంభించింది. తబ్లిగీ జమాత్ కేసుతో సంబంధం ఉన్న 541 మంది విదేశీయులపై ఢిల్లీ పోలీసులు 12 ఛార్జిషీట్లు దాఖలు చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.