భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరుకుంది. భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ నిర్ణయించిన ప్రణాళికకు అనుగుణంగా రఫేల్ యుద్ధ విమానం మన దేశానికి అందడం హర్షణీయమని చెప్పారు. భారత వాయు సేనకు ఈ యుద్ధ విమానం వల్ల మరింత బలం చేకూరుతుందన్నారు. భారత్, ఫ్రాన్స్ పెద్ద ప్రజాస్వామిక దేశాలని, ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లోనూ సహకారం మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
యుద్ధ విమానాన్ని సకాలంలో అందజేయడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఒప్పందంలో భాగంగా మిగిలిన యుద్ధ విమానాలను కూడా నిర్ణీత సమయం ప్రకారం అందజేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రఫేల్ అంటే సుడిగాలి అని, ఆ పేరుకు తగినట్లుగా ఈ విమానం సేవలందించగలదని చెప్పారు. భారత దేశ పరిసర ప్రాంతాల్లో శాంతి, భద్రతలను కాపాడేందుకు భారత దేశ గగనతల ఆధిపత్యం బలోపేతమయ్యేందుకు రఫేల్ దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.