ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. గత నెల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కమల్‌హాసన్ వృద్ధుడి పాత్రలో సరిగ్గా కుదరలేదని.. ఇటీవల చిత్రీకరణను తాత్కాలికంగా ఆపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఏఆర్ రెహమాన్ కావాలంటూ కమల్ పట్టుబడుతున్నారని కూడా చెబుతున్నారు. మరో వైపు నిర్మాణ ఖర్చు వివరాలను పూర్తిగా వెల్లడించాలని లైకా అధినేత అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్ని సమస్యల నడుమ ఈ సినిమా కొనసాగడం కష్టమేనని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ అంశానికి సంబంధించి నిర్మాత, దర్శకుడు చర్చించారని తెలుస్తోంది. మళ్లీ మేకప్‌మేన్‌లను రప్పించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సంగీత దర్శకుడిగా అనిరుధ్‌నే ఖరారు చేసినట్లు సమాచారం. కొన్ని సమస్యలు కొలిక్కిరావడంతో చిత్రీకరణను శరవేగంగా నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది. మరో వైపు చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో పెద్ద సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తదుపరి చిత్రీకరణ అక్కడే జరుగుతుందని తెలుస్తోంది.