దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ తప్పనిసరి అని తెలిపారు. లాక్‌డౌన్ అంటే కర్ఫ్యూ లాంటిదేనని ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని ఈ విపత్కర సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఒక ప్రధానిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నానని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.
21 రోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని మోదీ సూచించారు. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం అని తెలిపారు. కరోనా అంటే రోడ్లపైకి ఎవరూ రాకూడదని అర్ధం అన్నారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే ఆ తర్వాత పరిస్థితి చేయిదాటిపోతుందని అన్నారు. ఎవరూ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించవద్దని కోరారు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని తెలిపారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధంగా
పోరాడుతున్నాయని తెలిపారు. 24 గంటల పాటు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ అన్నారు. ఈ లక్ష్మణ రేఖను ఎవరూ దాటొద్దని సూచించారు. కరోనా నియంత్రణకు అత్యవసరంగా రూ. 15 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.